© 2026 nimisham.in

అది అట్లాంటిక్ మహాసముద్రపు తీరం.. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల సప్పుడు తప్ప మనుషుల అలికిడే ఉండదు. వినడానికి ఏదో హర్రర్ సినిమాలో సైలెంట్ ఐలాండ్ లా అనిపించినా..
ఇది అమెరికాలోని మైనే తీరంలో ఉన్న విచ్ ఐలాండ్ (Witch Island) కథ! సరిగ్గా 18 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చిన్న దీవి వెనుక నమ్మశక్యం కాని ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునే స్థలంగా, ఆ తర్వాత దెయ్యాల దీవిగా ప్రచారంలోకి వచ్చి.. చివరకు ఒక రహస్య మహిళ చేతి నుంచి పక్షులు, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.1630ల కాలంలో డిక్సీ బుల్ అనే ప్రసిద్ధ సముద్రపు దొంగ తన దోపిడీ సొత్తును దాచడానికి ఈ దీవిని ఒక సీక్రెట్ స్థావరంగా వాడుకునేవాడని ఇక్కడ ప్రచారంలో ఉన్న పాత కథ. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఓడలు ఇక్కడే దాక్కునేవట. కాలక్రమేణా ఈ దీవి పలువురి చేతులు మారింది. అయితే 1887లో డానియల్, అన్నా చిట్టెండెన్ అనే దంపతులు వేలంలో ఈ దీవిని కొనుగోలు చేయడంతో దీని అసలు కథ ప్రారంభమైంది.ఎవరీ విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్?అన్నా అనే మహిళ జీవితం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చిన్నతనంలోనే కష్టాలు అనుభవించి, నాటకరంగంలో రాణించి, ఒక భారీ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో షేర్ల ధరలు ఎలా పెరుగుతాయో ముందుగానే ఊహించి చెప్పే విచిత్ర శక్తి తన వద్ద ఉందంటూ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు ఆమె జోస్యాలు విని పెట్టుబడులు పెట్టేవారు. దీంతో ప్రతిఒక్కరూ ఆమెను ప్రేమగా, భయంగా విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (వాల్ స్ట్రీట్ మంత్రగత్తె) అని పిలవడం ప్రారంభించారు. ఈమే విచ్ ఐలాండ్‌లో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ప్రశాంత జీవితం గడపడం మొదలుపెట్టింది. ఆమె పేరు మీదుగానే ఈ దీవికి విచ్ ఐలాండ్ అనే పేరు స్థిరపడిపోయింది.Union Bank: లేడీ బ్యాంక్ ఆఫీసర్ మిస్సింగ్ కేస్ మిస్టరీ! కళ్లు మూసి తెరిచేలోపే మాయం..ఒంటరి మహిళ చేసిన చారిత్రాత్మక త్యాగం!1964లో జేన్ సెవాల్ అనే మరో ఒంటరి మహిళ ఈ దీవిని పూర్తిగా కొనుగోలు చేసింది. చిన్నతనం నుంచే ఆ దీవితో ఉన్న అనుబంధంతో ఆమె అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుని, దాదాపు 20 ఏళ్ల పాటు ఒంటరిగానే నివసించింది. కానీ, కాలక్రమేణా అక్కడకు వచ్చే పర్యాటకులు క్యాంప్ ఫైర్లు పెడుతూ, చెట్లను, పక్షులను పాడుచేస్తుండటంతో జేన్ తీవ్రంగా కలత చెందింది. ఈ ప్రకృతి సౌందర్యం మనుషుల స్వార్థానికి బలికాకూడదని భావించిన జేన్... ఏమాత్రం ఆలోచించకుండా 1986లో తన 18 ఎకరాల స్వంత దీవిని వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు ఉచితంగా దానం చేసేసింది.విశ్వం దాటి వస్తున్న ఏలియన్స్ సిగ్నల్స్? కోట్ల ఏళ్ల నాటి వింత శబ్దాల రహస్యం!నేడు ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంజేన్ చేసిన ఆ ఒక్క నిర్ణయంతో నేడు విచ్ ఐలాండ్ పూర్తిగా మనుషుల ఆక్రమణలు లేని ఒక స్వచ్ఛమైన అభయారణ్యంగా మారింది. ప్రస్తుతం కోస్టల్ రివర్స్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఈ దీవిని పర్యవేక్షిస్తోంది. ఇక్కడ ఇళ్లు కట్టడానికి గానీ, శాశ్వతంగా నివసించడానికి గానీ ఎవరికీ అనుమతి ఉండదు. కేవలం పడవల్లో వచ్చి ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులకు, బోటింగ్ చేసుకునే వారికి, సైన్స్ క్యాంప్‌లకు వచ్చే పిల్లలకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ దిగ్గజాలను ఊపేసిన మహిళ నివాసంగా ఉన్న ఈ దీవి.. నేడు పక్షులు, చెట్లకు రక్షణ కవచంగా నిలవడం విశేషం!