© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CPS Pension Issue: ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల పాటు తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత సీపీఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా, గౌరవంగా బతకాలన్న ప్రతి ఉద్యోగి ఆశలను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అట్టడుగుకు తొక్కిపారేస్తోంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి దిగిపోయే ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేలల్లో పెన్షన్లు, అలవెన్సులు కల్పించుకుంటున్న పాలకులు... జీవితాంతం ప్రజాసేవలో తరించిన ఉద్యోగికి మాత్రం రిటైర్మెంట్ తర్వాత కనీస అవసరాలు తీర్చలేని పెన్షన్ ఇస్తూ చీకటిలోకి నెట్టేస్తున్నారు.
ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఒక ఘటన సీపీఎస్ ఉద్యోగుల పాలిట ఎంతటి నరకమో కళ్లకు కడుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పేదలు, వృద్ధులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ నెలకు రూ. 4,000 కాగా, సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక సీపీఎస్ ఉద్యోగి చేతికి వస్తున్న నెలవారీ పెన్షన్ కేవలం రూ. 3,882 మాత్రమే... ఏ సమస్యా లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సామాజిక పింఛను కంటే, ముప్పై ఏళ్లు చెమటోడ్చి సేవ చేసిన ఉద్యోగికి వచ్చే పింఛను తక్కువగా ఉందంటే... ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అదృష్టవంతుడా...లేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా అనేది నిర్ణయించే విచక్షణ పాలకులకే వదిలేయాలని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎదురైన ఈ దారుణమైన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేపు తమకు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇదే దయనీయ స్థితి ఎదురవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. తెలంగాణలో లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు సీపీఎస్ కు వ్యతిరేకంగా పోరాట బాట పట్టడానికి ప్రధాన కారణం ఇదే. పాత పెన్షన్ విధానం (OPS)లో అయితే ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం మొత్తాన్ని గ్యారెంటీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా రెండుసార్లు కరువు భత్యం (డీఏ) పెరుగుతుంది. కానీ సీపీఎస్‌లో అవేమీ ఉండవు. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా 10 శాతం సొమ్మును బలవంతంగా కోత విధించి, ఆ మొత్తాన్ని అనిశ్చితమైన షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు.
ఓపీఎస్ vs సీపీఎస్: ఉద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం పాత పెన్షన్ విధానానికీ (OPS), సీపీఎస్కూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగికి జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతుంది. ఓపీఎస్‌లో ఉద్యోగి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కోత ఉండదు. రిటైర్ అయిన తర్వాత నెలకు కనీస పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది. కానీ సీపీఎస్‌లో ఉద్యోగి జేబు నుంచే 10 శాతం కోత విధిస్తారు. రిటైర్ అయ్యాక మొత్తం కార్పస్ నిధిలో 60 శాతం మాత్రమే చేతికి ఇస్తారు. మిగిలిన 40 శాతం సొమ్ముతో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మార్కెట్ వడ్డీ రేట్ల ఆధారంగా ఆ కంపెనీలు విసిరే కొన్ని వందలు లేదా వేల రూపాయలే ఉద్యోగికి నెలానెలా దక్కుతాయి. దీనికి డీఏ పెంపుగానీ, పిఆర్సి లబ్ధిగానీ వర్తించవు. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు కూడా ఆ డబ్బులు సరిపోని పరిస్థితి దాపురిస్తోంది.
తెలంగాణలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సీపీఎస్‌ను ఒక విద్రోహ పూరిత విధానంగా చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక సాంకేతిక కారణాలు చెబుతూ కాలయాపన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో సేవలు అందించే ఉద్యోగికి శేష జీవితంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మార్కెట్ జూదంలో ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం సరికాదని సంఘాల నాయకులు నిలదీస్తున్నారు. తక్షణమే సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే తెలంగాణ వ్యాప్తంగా సమ్మె బాట పడతామని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.