© 2026 nimisham.in
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో సెప్టెంబర్ నాలుగో తేదీన గోకులాష్టమి ఆస్థానం, 5న ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామికి నివేదనలు సమర్పిస్తారు. అనంతరం ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. దీని తర్వాత ద్వాదశారాధనం చేపడతారు.అలాగే సెప్టెంబర్ నాలుగో తేదీ గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి పంచాభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక సెప్టెంబర్ ఐదో తేదీ తిరుమలలో ఉట్లోత్సవం జరగనుంది. ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. కార్యక్రమంలో భాగంగా యువకులు ఉట్లోత్సవంలో పాల్గొని.. ఉత్సాహంతో ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురిసి దేశప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ టీటీడీ చేపడుతున్న కారీరిష్టి యాగం రేపటితో ముగియనుంది. తిరుమలలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం.. గురువారం పూర్ణాహుతితో ముగియనుంది. సకాలంలో వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ టీటీడీ 1994వ సంవత్సరం నుంచి కారీ రిష్టి యాగాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ వైదిక క్రతువు సెప్టెంబర్ మూడో తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యన నిర్వహించే పూర్ణాహుతితో ఘనంగా ముగియనుంది.