© 2026 nimisham.in

దిల్లీ: ప్రపంచ వాతావరణంలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా చిలీ దేశంలోని అటకామా ఎడారిలో భారీగా మంచు కురిసింది. ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశంగా ప్రసిద్ధి చెంది
న ఈ ఎడారిలో అప్పుడప్పుడూ మంచు పడుతున్నా.. ఇంత భారీస్థాయిలో కురవడం ఇదే ప్రథమమని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎడారిలో భారీ మంచు కురిసిన దృశ్యాలను నాసా విడుదల చేసింది. ఉత్తర చిలీ నుంచి యాండెస్ పర్వత శ్రేణుల వరకూ, అటు నుంచి పసిఫిక్ తీరం వరకూ ఎటు చూసినా ఈ ఎడారిని మంచు కమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసలు వర్షపాతమే కురవని అటకామా ఎడారిలో మంచు కురవడాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు అసాధారణ పరిణామంగా పేర్కొంటున్నారు. సాధారణంగా ఇక్కడి వాతావరణం అంగారక గ్రహంలోని వాతావరణ పరిస్థితులకు సమానంగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఖగోళ వాహకాలను పరీక్షించేందుకు ఉపయోగిస్తారు. ఆ ఎడారిలోని ఖగోళ పరిశీలన కేంద్రమైన అల్మా సైతం మంచుతో నిండిపోయింది. తీవ్ర చలిగాలులు, వాతావరణంలో తేమ, వాతావరణ మార్పులు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. గతేడాది డిసెంబరులో సౌదీ అరేబియా ఎడారిలో మంచు కురిసిన దృశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.